2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు తమ నియోజకవర్గాలకు వందల కోట్లను తరలించిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో చెకింగ్‌లో భాగంగా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుకు చెందిన రూ. 1.92 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా పోలీసులకు పట్టుబడిన రూ.1.92 కోట్లు తనవేనని మాజీ ఎంపీ మాగంటి బాబు క్లెయిమ్ చేసుకున్నారు. అది చేపలు అమ్మగా వచ్చిన ఆదాయమని.. ఆ మొత్తాన్ని రిలీజ్ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు మాగంటి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఏప్రిల్ 10వ తేదీన సిమెంట్ లోడు లారీలో తరలిస్తున్న రూ.1,92,90,500 నగదును విజయవాడ పటమట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేట నుంచి ఏలూరు వెళ్తున్న లారీని కామినేని ఆస్పత్రి సమీపంలో చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు. అందులో సిమెంట్ బస్తాల మధ్య రెండు బాక్స్‌లు ఉండటాన్ని గమనించి వాటిని తెరిచి చూడగా.. భారీ నగదు కనిపించింది. ఈ సమయంలో అదే లారీలో ప్రయాణిస్తున్న మాగంటి అనుచరుడు పరారయ్యాడు. డ్రైవర్ కోగంటి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని.. ఆ డబ్బును ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం తీసుకెళ్తున్నట్టు తనతోపాటు లారీలో వచ్చిన యువకుడు చెప్పాడని డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆ మొత్తాన్ని అప్పట్లో విజయవాడ నగర పోలీసులు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
రెండు రోజుల క్రితం నగర పోలీస్ కమిషనర్‌ను కలిసిన మాగంటి బాబు ఆ సొమ్ము మొత్తం తనదేనని, చేపల్ని విక్రయించగా సమకూరిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన లావాదేవీ పత్రాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు చూపగా రూ.64 లక్షల పన్ను విధించారని వివరించారు. పన్ను చెల్లించిన దృష్ట్యా సీజ్ చేసిన డబ్బును తనకు ఇప్పించాలని కోరారు. మాగంటి బాబు చెబుతున్నట్టుగా ఆ డబ్బు సక్రమంగా సంపాదించిందే అయితే రూ.64 లక్షలను ఆదాయ పన్ను, అపరాధ రుసుంగా ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపల విక్రయం ద్వారానే అంత ఆదాయం వచ్చినా.. పన్నులేవీ చెల్లించకుండా రహస్యంగా ఎందుకు తరలించాల్సి వచ్చిందనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. పోలీసులు కనబడగానే మాగంటి అనుచరుడు పరారవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. అయితే రూ. 1.92 కోట్లు రాబట్టుకునేందుకు మాగంటి బాబు ఏకంగా 64 లక్షలు పన్ను చెల్లించడం వెనుక..ఏదో మతలబు ఉందని…అది కచ్చితంగా అక్రమ సొమ్మే అని ఏలూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తంగా కోటి 92 లక్షలు వెనక్కి రాబట్టుకునేందుకు మాగంటి బాబు ఏకంగా 64 లక్షలు పన్ను చెల్లించడం ఏలూరులో హాట్ టాపిక్‌గా మారింది.