పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా డోకిపర్రు వద్ద మొక్కను నాటి సీఎం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతగానో దోహద పడతాయని.. దీనిని దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగే వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరయ్యారు. భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలని సీఎం వైయస్ జగన్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఓ అశోకుడు కావాలని… తప్పకుండా చెట్లు నాటాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. మనం నాటే ప్రతి మొక్క భావి తరాలకు ఫలాలను అందిస్తుందని, ప్రాణ వాయువును అందిస్తుందని చెప్పారు. ‘అశోకుడు దారికి ఇరువైపులా చెట్లు నాటించెను’ అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నామని… ఆయన నాటించిన చెట్లు ఆ తర్వాతి తరాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. అడవులను నరికేయడం వల్ల భూతాపం పెరిగిందని, ఫలితంగా మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని అన్నారు. రాష్ట్రంలో 23 శాతం అడవులు మాత్రమే ఉన్నాయని… దీన్ని 33 శాతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యేలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రోశయ్య, సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.