మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గం నేత ఆదినారాయణరెడ్డి సీనియర్ నేత. ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆదినారాయణరెడ్డి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను హైదరాబాద్ లో కలవడం మరింత ఊతమిచ్చింది. నడ్డానుకలసి వచ్చిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. తాజాగా ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అయినట్లు సమచారం. తన అనుచరులతో సమావేశమై తేదీ నిర్ణయించడమే ఇక మిగిలిందంట. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి చంద్రబాబును కలిసి మాట్లాడింది నిజమే. నా నియోజక వర్గ కార్యకర్తలతో మాట్లాడి చెపుతానని ఆయనకు స్పష్టంగా చెప్పాను అని ఆదినారాయణరెడ్డి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పార్టీలో కొనసాగుతానని టీడీపీ వర్గాలు చెప్పడం సరికాదు అని ఆదినారాయణరెడ్డి అన్నారు. తనకు దేశభక్తి ఎక్కువనీ, తన ప్రాంతం అభివృద్ధి కోసమే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు కడప జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరపలేదన్నారు. అందుకే తాను ఓడిపోయానని ఆదినారాయణరెడ్డి వివరించారు.
