పల్నాడులో అధికార విపక్ష పార్టీల మధ్య పాలిటిక్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశముతున్నాయి. తాజాగా గుంటూరులో టీడీపీ వైసీపీ బాధితుల శిబిరం నిర్వహిస్తోంది. దీనిని పెయిడ్ ఆర్టిస్టులతో నిర్వహిస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. తాజాగా గుంటూరులోని టీడీపీ శిబిరాన్ని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సందర్శించారు. అక్రమ కేసులు, దాడులతో వేధిస్తున్నారని తెలిపారు. అలాగే వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో రేపు ఛలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.
రేపు ఉదయం 9 గంటలకు చంద్రబాబు గుంటూరు అరండల్‌పేట పునరావాస శిబిరానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆత్మకూరు వెళ్లనున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని, అవినీతి అంతానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే గందరగోళం సృష్టించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో చాలా దారుణాలు జరిగాయన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాక పల్నాడు ప్రశాంతంగా ఉందని, తన పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అందుకే తాముకూడా ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చామన్నారు.
ఆత్మకూరుకు కోడెల బాధితులు, యరపతినేని బాధితులు, పుల్లారావు బాధితులు, జీవీ ఆంజనేయులు బాధితులతో కలిసి ఆత్మకూరు వెళతామన్నారు. గుంటూరు వైఎస్సార్‌సీపీ ఆఫీసు నుంచి ఛలో ఆత్మకూరుకు పిలుపునిస్తున్నామన్నారు. టీడీపీ శిబిరంలో ఉన్నవారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని తెలిపారు. గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు జరిగితే మా ప్రమేయం ఉందని చంద్రబాబు ఆరోపించడం దారుణంమని, గుంటూరు జిల్లాలో చాలావరకు ఫ్యాక్షన్ తగ్గింది. మరోవైపు పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్టు అమలులో ఉందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఊరేగింపు, ధర్నాలకు అనుమతి లేదని తెలిపారు. ప్రజలు వినాయకచవితి, మొహర్రం ప్రశాంతంగా జరుపుకుంటున్నారన్నారు కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలన్నారు. మరోవైపు పల్నాడు ఎపిసోడ్‌లో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. టీడీపీ బాధితులందరికీ రక్షణ కల్పిస్తామని హోంమంత్రి సుచరిత హామీ ఇచ్చారు.