టీడీపీ ఏర్పాటు చేసిన పెయిడ్ ఆర్టిస్టుల పునరావాస శిబిరంతో పల్నాడు రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీంతో ఇప్పుడు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. పోలీసు శాఖ అనుమతి నిరాకరించినా తీరాల్సిందేనని రెండుపార్టీలు స్పష్టం చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, గ్రామాల్లోకి రానీయండం లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ గుంటూరులో పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. దానికి పోటీగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా టీడీపీ బాధితుల పునరావాస శిబిరం నిర్వహించి టీడీపీ హయాంలో నష్టపోయినవారి తరపున ప్రభుత్వం నుండి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ కార్యక్రమానికి గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి న్యాయకత్వం వహిస్తున్నారు. గత కొన్నాళ్లుగా పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాలపై మహేశ్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. కోడెల అరాచకాలనుంచి, యరపతినేని అక్రమమైనింగ్ వరకూ కాసు మహేశ్ రెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత, లోకేశ్ అండతో గతంలో యరపతినేని చేసిన దుర్మార్గాలు, రాజకీయ దాడులపై మహేశ్ పోరాటం చేసారు. జిల్లావ్యాప్తంగా ఇంత బలమైన టీడీపీ క్యాడర్ ఉన్నా వైసీపీకి స్పష్టమైన మెజారిటీ కనిపించడంలో కాసు కృషి ఉందనే చెప్పుకోవాలి. అధికారంలో లేకపోవడంతో అరెస్టులు చేయడం, అనుచరులపై దాడులు చేసినా ప్రజల పక్షాన టీడీపీ అరాచకాలపై మహేశ్ రెడ్డి పోరాటం చేసారు. ఇదిలా ఉంటే తాజాగా పల్నాడులో దాడులకు గురైన టీడీపీ బాధితులను తానే స్వయంగా గ్రామాలకు తీసుకెళ్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రేపు చలో ఆత్మకూరు కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులంతా హాజరవ్వాలని కోరారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యేల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరులో మంగళవారం సమావేశమైన ఆ పార్టీ నేతలంతా టీడీపీ బాధితులతో ఆత్మకూరుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.
వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి చలో ఆత్మకూరు ప్రారంభమవుతుందన్నారు. గత ఐదేళ్లలో ఏం జరిగిందనే విషయాలు ప్రజలకు తెలియజేయాలని వైసీపీ నేతలు చెబుతున్నారు. కోడెల, యరపతినేని, పుల్లారావు, జీవీ ఆంజనేయులు బాధితులతో ఆత్మకూరు వెళ్తామని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, జిల్లా ఎంపీలు నందిగం సురేశ్, లావు శ్రీకృష్ణలు ప్రకటించారు. అక్కడికి వచ్చే చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెండ్రోజుల క్రితమే తెలుగు దేశం పార్టీ బాధితుల సమావేశం పిడుగురాళ్ల వాసవీ కళ్యాణ మండపంలో కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హోం మంత్రి సుచరిత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీడీపీ పాలనలో ప్రాణాలు కోల్పోయిన వారు, ఆస్తులు నష్టపోయిన వారు తమ గోడును హోంమంత్రికి విన్నవించారు. కాసు మాట్లాడుతూ చంద్రబాబు పల్నాడుకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని తానొక్కడినే వచ్చి ఇక్కడి పరిస్థితిని చూపిస్తానని పేర్కొన్నారు. ఎక్కడికైనా చర్చకు సిద్ధమని, చంద్రబాబుకు అందుకు సిద్ధమా అని కాసు మహేష్‌రెడ్డి సవాలు విసిరారు. సీఎం వైయస్ జగన్ వంద రోజుల పాలన ప్రశాంతంగా సాగుతుందని దీనిని ఓర్చుకోలేకనే టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశానికి భారీగా హాజరై తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్న బాధితులతో రేపు ఎట్టిపరిస్థితుల్లో ఆత్మకూరు వెళ్లనున్నామని మహేశ్ రెడ్డి, ఆయన అనుచరులు చెప్తున్నారు.