ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు జరిగే కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాలు సిద్ధమయ్యాయి. ఏటా దసరా పర్వదినం నాడు జరిగే ఈ ఆచార రణరంగానికి సర్వం సిద్ధమైంది. దేవరగట్టు కొండలో వెలసిన మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీగా వస్తుంది. కొత్తపేట, నెరణికి తండా గ్రామాలు ఒకవైపు…అరికెర, ఆలూరు, బిలేహల్, ఎల్లార్తి, సులువాయి, విరూపాపురం, నిత్రవట్టి గ్రామాలు మరోవైపు వర్గాలుగా విడిపోయి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో తలపడతారు. ఈ సమరానికి బన్ని ఉత్సవంగానూ పేరుంది.దేవరగట్టు కర్రల సమరం తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఆచారం పేరిట ఏటా ఈ రక్తపాతం సాగుతూనే ఉంది. కొంతమంది కర్రలకు ఇనుప రింగులు తొడిగి బన్ని ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలు పగిలి, గాయాల తీవ్రత పెరుగుతుంటాయి. ప్రాణపాయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
