ఏడాది పాటు అనంతపురం పీటీసీ లో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలు ఈరోజు మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్న ఈ 25 మంది డీఎస్పీలలో పదకొండుమంది మహిళా డీఎస్పీలు ఉన్నారు. వీరితో ఉన్నతాధికారులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి శిక్షణలో ప్రతిభ కనబరచిన సిబ్బందికి షీల్డ్స్ ను అందజేశారు. అనంతరం ప్రసంగించిన డీజీపీ గౌతమ్ సవాంగ్.. శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది డిఎస్పీలకు నా అభినందనలు. విధుల్లో అప్రమత్తం గా ఉంటూ.. సమాజానికి సేవలు అందించాలని శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర అని అన్నారు. అంతేకాకుండా సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్య పై కఠినంగా ఉండాలి.ప్రతిఒక్కరూ ఫజికల్ ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టి.. యాక్టివ్ గా ఉండాలి.ప్రజలకు చేరువగా… అండగా ఉండేలా మన పోలీసింగ్ ఉండాలని అన్నారు. ఇక హోంమంత్రి సుచరిత గారు మాట్లాడుతూ నవ్యాంధ్ర లో మొదటి డిఎస్పీ పాసింగ్ పెరేడ్ లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 25మంది డిఎస్పీలలో 11మంది మహిళలు ఉండటం అభినందనీయం అన్నారు. ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తు వచ్చేది పోలీసులే .పోలీస్ శాఖ, కుటుంబ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టాలి. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పై లోతైన అవగాహన కలిగి ఉండాలి.70శాతం జనాభా ఉన్న గ్రామాలలో నిరంతరం పోలీసులు పర్యటించాలని అన్నారు.