దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన మాంబట్టులోని అపాచీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్), విశాఖపట్నంలోని బ్రాండిక్స్ సెజ్ తరహాలోనే వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే మరో సెజ్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్‌మెంట్ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ సీఎఫ్‌వో టిమ్‌కుతు, డైరెక్టర్లు మిన్ హిసు తస్సాయి, హాసాయోయన్‌లీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసి, పెట్టుబడుల ప్రతిపాదనలను వివరించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భాగస్వామ్య సంస్థతో కలిసి నెల్లూరు జిల్లా మాంబట్టులో అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కింద ఇచ్చే రాయితీలు, పారిశ్రామిక విధానం ప్రకారం వచ్చే రాయితీలు తప్ప అదనపు రాయితీలేవీ అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో దాదాపుగా 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.