విజయవాడలో ఇసుక దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్న చంద్రబాబుకు అదే రోజు కోలుకోలేని దెబ్బపడింది. కృష్ణా జిల్లా టీడీపీలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇసుక దీక్ష జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్ పక్షంలో వైసీపీలో చేరారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన పదునైన విమర్శలతో చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల పరువు తీశాడు. ఇక బెజవాడ టీడీపీలో మాస్ లీడర్‌గా గుర్తింపు పొందిన యువనేత దేవినేని అవినాష్ వైసీపీలో చేరడం టీడీపీ నేతలకు షాకింగ్‌గా మారింది. వాస్తవానికి అవినాష్ 2019 సార్వత్రిక ఎన్నికలలో పెనమలూరు నుంచి కాని..విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే దేవినేని ఉమ రాజకీయంతో చంద్రబాబు గుడివాడ టికెట్ ఇచ్చాడు. ఆ ఎన్నికలలో కొడాలి నాని చేతిలో దేవినేని అవినాష్ ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికలకు అవినాష్ రాజీ పడకుండా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టారు. తాను అంత ఖర్చు పెట్టుకోలేనని అవినాష్ చంద్రబాబు ముందు వాపోయాడు. అయితే ముందు నువ్వు అయితే ఖర్చుపెట్టుకో..ఎన్నికల తర్వాత పార్టీ ఆర్థికంగా ఆదుకుంటుందని బాబు అవినాష్‌కు భరోసా ఇచ్చారు. అయితే ఎన్నికల తర్వాత అప్పులపాలైన అవినాష్ బాబు సాయం కోసం వెళితే..లోకేష్ అడ్డుపడ్డాడంట…మనం అవినాష్‌కు డబ్బులు ఇస్తే ఓడిపోయిన వాళ్లందరూ వచ్చి అడుగుతారు..అని లోకేష్ చెప్పడంతో అవినాష్‌కు బాబుగారు పెద్ద హ్యాండ్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్‌లు ఇచ్చిన మాట తప్పడం, పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం అవినాష్‌ను కుంగదీసింది. అందుకే ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని చెప్పిన అవినాష్ వైసీపీలో చేరాడు. దేవినేని అవినాష్ వైసీపీలో చేరడం కృష్ణా జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా వైసీపీలోకి అవినాష్ చేరికపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాపం పార్టీ కోసం ఎంతో కష్టపడిన అవినాష్‌ను గుడివాడలో తనపై పోటీ చేయించి.. రాజకీయ బలి పశువు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్షతో… టీడీపీ ఎమ్మెల్యేలు విసుగుచెంది వైసీపీలోకి వస్తున్నారని చెప్పారు. టీడీపీ త్వరలో ప్రతిపక్ష హోదాను కోల్పోనుందని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఓడిపోయిన అవినాష్ వైసీపీలో చేరడంపై కొడాలి నాని ఎలా స్పందిస్తారో అని కృష్ణా జిల్లా రాజకీయవర్గాలు ఎదురుచూశాయి. అయితే నాని మాత్రం అవినాష్‌పై సింపతీ చూపించడం ఆసక్తికరంగా మారింది.
