ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ…తమ హయాంలో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును 92 శాతం పనులు పూర్తి చేసి ఇస్తే, టీడీపీ హయాంలో ఐదేళ్లలో మిగిలిన 8 శాతం పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంత్రి బొత్స విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను చంద్రబాబునాయుడు పక్కన పెట్టి, నారాయణ కమిటీ ఇచ్చిన సిఫారసులతో ముందుకు వెళ్లారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. తాము నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రాజధాని నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జనవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇంకా అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని పవిత్ర దేవాలయంగా చెబుతున్న టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఐదేళ్లలో దానిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టు నిర్మాణం ఒక్కటే 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసి వారికి ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. . సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వి.శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు, బడ్డుకొండ అప్పలనాయుడు, కలెక్టర్ హరి జవహర్‌లాల్, తదితరులు పాల్గొన్నారు.