టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం గత నవంబర్‌లో ఆమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు. చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా సందర్భంలో ఆమె స్పష్టం చేశారు. తన వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో టీడీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. గజేంద్ర షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు టీడీపీ నేతలు బీజేపీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదినారయణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరితో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
