ఏపీలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే 7 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి గతంలోనే అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా మరో 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో తొమ్మిది నెలల వ్యవధిలోనే 15 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లైంది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం వైద్య కాలేజీల సంఖ్య 26కి చేరనుంది. 8 నూతన వైద్య కళాశాలలకు భూమి సమకూర్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2014–19 మధ్య రాష్ట్రంలో ఒక్కటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాకపోవడంతో బోధనాసుపత్రులకు రోగుల తాకిడి తీవ్రంగా పెరిగింది.
