స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడక్కడ చిల్లర గొడవలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయి తిరిగి పుంజుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో సహజంగా ఉండే రాజకీయ కక్షలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు.. ప్రజలను ఏమార్చేందుకు, ఓటమికి సాకులు చెప్పుకునేందుకే వ్యూహాత్మకంగా ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయనన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన సంఘటన కూడా ఇందులో భాగమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోనూ స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి టీడీపీ ప్రయత్నించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పెదపూడి, చిత్తూరు జిల్లా పుంగనూరు, చంద్రగిరి, గుంటూరు జిల్లా దాచేపల్లి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తదితర చోట్ల కూడా ఇదే తరహాలో కుట్రను అమలుచేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ వెంటనే స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌రావును ఆదేశించారు. దీంతో ఐజీ మాచర్లకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఐజీ వెంట గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు కూడా ఉన్నారు.
