రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్ ఇస్తుంది. నిర్ధారించిన ఈ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణలోకి తీసుకోవాలని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీడియాకు సూచనలిచ్చారు. కరోనా కేసుల విషయంలో, వైరస్ వల్ల మరణాల విషయంలో నిర్ధారణలేని సమాచారాన్ని ప్రచురించరాదని, ప్రసారం చేయరాదన్నారు. మార్చి 20వ తేదీన విశాఖలో కరోనా వైరస్ మరణం అటూ పలు వార్తసంస్థలు, ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన విషయాన్ని గుర్తుచేసారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమానిత కేసుల పేరుతో సమాచారాన్ని ప్రచురించవద్దన్నారు. కరోనా సోకి పాజిటివ్‌గా వచ్చిన కేసుల విషయంలో వారి పేర్లు, వారి చిరునామాలు ప్రసారం చేయరాదన్నారు. వదంతులు, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయరాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వెబ్సైట్లు, డబ్ల్యూహెచ్ఓ నిర్వహిస్తున్న వెబ్సైట్లను అనురించడంద్వారా వైరస్‌కు సంబంధించి సరైన సమాచారాన్ని పొందవచ్చన్నారు. అలాగే మూఢ నమ్మకాలను వ్యాప్తిచేసేలా సమాచారాన్ని ప్రచురించరాదని, ఈ మార్గదర్శకాలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు.
