ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుంది. అత్యవసర సేవలు తప్ప, మిగతావి అన్నీ బంద్ చేసింది. ఇక కూరగాయలు, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు పగటి పూట కొంత సమయం ఇచ్చింది. అయితే ఈ లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో, పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక, డబ్బులు వచ్చే మార్గం లేక సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఏపీ ప్రభుత్వం కూడా పేదల కష్టాల తీర్చేందుకు ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఏపీ లాక్ డౌన్ సందర్భంగా పేదలకు ఉచిత రేషన్, కేజీ పప్పు అందిస్తామని సీఎం జగన్ ఇదివరకే ప్రకటించారు
మార్చి 29వ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంచుతామని జగన్ చెప్పారు. ఏప్రిల్ 4వ తేదీన గ్రామ వాలంటీర్లు రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకే వచ్చి వారికి రేషన్, రూ.1000 ఇచ్చి వెళతారని జగన్ ప్రకటించారు.
ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు మరో వరం ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.. ఈ లాక్ డౌన్ ఉన్న సమయంలో పేద ప్రజలకు కరెంట్ బిల్లులు మాఫీ చేయచ్చు అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రీడింగ్ తీయకుండానే కరెంట్ బిల్లు ఇచ్చేందుకు ఏపీ విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
వినియోగదారులు గత మూడు నెలల్లో వినియోగించిన విద్యుత్ వినియోగాన్ని బట్టి విద్యుత్ శాఖ బిల్లును నిర్ణయించనుంది. కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ కరెంట్ బిల్ విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరెంట్ బిల్లు కూడా మాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.