ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు కర్నూలు జిల్లాలోని హుసేనాపురంలో నిర్వహించిన మహిళా గర్జన సదస్సులో పాల్గొన్నారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సభకు వస్తున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన వైఖరిపై మండిపడ్డారు.
సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని… ప్రభుత్వం కోసం కాకుండా తమ నెత్తి మీద ఉన్న టోపీ మీదున్న మూడు సింహాల కోసం మాత్రమే పని చేయాలని… ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టేందుకు మీరు పని చేయడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తాను… అక్కలు, చెల్లెమ్మల సమస్యలు వినేందుకు వస్తే, మీరు అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు .