తూగో జిల్లాలో దేవిపట్నం నుంచి సెప్టెంబర్ 15న పాపికొండలు వెళుతున్న రాయల్ వశిష్టబోటు కచ్చలూరు వద్ద ప్రమాదవశాత్తు మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 51 మంది మరణించారు. వీరిలో 13 మంది ఆచూకీ గల్లంతు అయింది. కాగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే గోదావరి నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రోజులు గడిచినా వంద అడుగుల లోతున ఉన్న బోటును నిపుణులు కూడా బయటకు తీయలేకపోయారు. ఆచూకీ గల్లంతైన వారి మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. బోటు వెలికితీత గురించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సీఎం జగన్ బోటును వెలికితీసే బాధ్యతను 22 లక్షలకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీమ్‌కు అప్పగించారు. ఇక అప్పటినుండి ధర్మాడీ సత్యం టీమ్ బోటును పైకి తీసేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలం అయింది.
చివరకు విశాఖ నుంచి వచ్చిన గజఈతగాళ్ల సహాయంతో ధర్మాడి సత్యం టీమ్ బోటును వెలికితీసింది. బోటులో చిక్కుకున్న మృతుల భౌతికదేహాలను సంబంధిత బాధిత కుటుంబాలకు అధికారులు అప్పగించారు. పెద్ద పెద్ద అధికారయంత్రాంగమే బోటు వెలికితీతపై చేతులు ఎత్తేసిన వేళ..మేము తీస్తామంటూ ముందుకు వచ్చి..ఎన్నో వ్యయ ప్రయాసకు ఒనర్చి విజయవంతంగా బోటును వెలికితీసిన ధర్మాడి సత్యంపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. కచ్చలూరు వద్ద బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం సాహసానికి మెచ్చిన జగన్ సర్కార్ ఆయనకు వైయస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మొత్తంగా ధర్మాడి సత్యానికి వైయస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.