Home / ANDHRAPRADESH / వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఔదార్యం..

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఔదార్యం..

హిందూపురం పార్లమెంట్‌ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ తన ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుడిని దగ్గరుండిమరీ తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. వివరాల్లోకెళితే… మండలంలోని పొగరూరు కెనాల్‌ గ్రామ క్రాస్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన బుచ్చమ్మ గారి వెంకటేశ్వర్‌రెడ్డి (36) గాయాలపాలైనట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అత్యవసర పనినిమిత్తం తన కారులో బయలుదేరారు. మరోవైపు పొగరూరు గ్రామ కెనాల్‌ క్రాస్‌ వద్ద ఉన్న తన పొలానికి నీరుగట్టేందుకు వెంకటేశ్వర్‌రెడ్డి వెళ్ళారు. పని ముగించుకొని తన ద్విచక్ర వాహనంలో వెంకటేశ్వర్‌రెడ్డి ఇంటిముఖం పట్టాడు. ఈ క్రమంలో రాంగ్‌ రూట్‌లో వెళ్తూ అటుగా వస్తున్న ఎంపీ వాహనాన్ని గమనించకుండా ఢీ కొన్నాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్వయంగా పామిడి ప్రభుత్వాస్పత్రికి తన వాహనంలో తరలించి వైద్యం చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరెడ్డి వైద్యానికి అయ్యే ఖర్చుంతా తానే భరిస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్‌ చేసి చెప్పారు.