పులివెందుల జన్మభూమి సభలో గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఏకంగా సీఎం పాల్గొన్న సభలో ఓ రౌడీషీటర్ హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా మారింది. అంతేగాకుండా అతడు ఏకంగా ఓ ఎంపీ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడం విస్మకరంగా మారింది. సభలో మాట్లాడుతున్న వైఎష్ అవినాష్ రెడ్డి పదే పదే వైఎస్ పేరు ప్రస్తావించడం చంద్రబాబు సహించలేకపోయారు. దాంతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నా సభలో రాజకీయాలు మాట్లాడొద్దంటూ ఆయన వారిస్తుండగా, అక్కడే ఉన్న రౌడీషీటర్ ఆకుల విజయ్ కుమార్ రెడ్డి వీరంగం చేశారు. ఏకంగా ఎంపీ మీద ఎగబడ్డారు. జనమంతా చూస్తుండగానే ఎంపీ అవినాష్ చేతిలో మైక్ ని లాక్కునే ప్రయత్నం చేశారు.
దాంతో ఇప్పుడీ వ్యవహారం పులివెందులలో ఆసక్తిగా మారింది. సీఎం సభలో రౌడీషీటర్లను పెట్టుకుని, ఇతరులకు చంద్రబాబు పాఠాలు చెప్పడం విచిత్రంగా ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా ప్రభుత్వ కార్యక్రమం ఇదంటూ ఎంపీకి సుద్దులు చెప్పిన చంద్రబాబు, అదే సభలో రౌడీషీటర్ ని ఎలా పెట్టుకున్నారో సమాధానం చెప్పాలంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.