వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు ఏపీ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, వీరు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్రత్యేక హోదా సాధన కోసం చేయని ప్రయత్నాలంటూ లేవన్నారు. ప్రతిపక్షంలో ఉండి వైఎస్ జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమని ఎద్దేవ చేశారు. ఏందేందీ.. మీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా..? 2016లో చేశారా..? 2017లో చేశారా..? 2018లో చేశారా..? మళ్లీ 2018 ఏప్రిల్ 6వ తేదీన మళ్లీ రాజీనామాలు చేస్తారా..? అంటూ వైఎస్ జగన్‌పై వెటకారం ప్రదర్శించారు. జైలుకెళ్లిన జగన్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించడం అసాధ్యమని ఏపీ మంత్రులు వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు.
