కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ రీత్యా ఆమె కుమారుడు సత్యనారాయణ (32) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మాతృమూర్తి ఇకలేదన్న వార్త తెలుసుకొని బోరున విలపిస్తూ హుటాహుటిన భార్య వెంకట సౌజన్య, మరదలు వెంకట మాధవితో కలిసి ఓ ప్రైవేటు క్యాబ్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ముందువెళ్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ, అతని మరదలు మాధవి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన సౌజన్య గర్భవతి కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడకు తరలించారు. గాయాల పాలైన డ్రైవర్ రాజేశ్‌కు కోదాడలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
