రాజకీయ పార్టీలు, సినీ అభిమానుల ముసుగులో కొందరు హద్దులు మీరుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వారి ఇంట్లోని వారిని లాగుతున్నారు. గతంలో పవన్ ఇదే విషయంపై సీరియస్ అయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అసభ్యకర రీతిలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడో దుర్మార్గుడు.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కలకలం రేగుతోంది. ‘చంటిఅబ్బాయి’ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ ఫొటోలను చూసిన శ్రవణ్ అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులు ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. విచారణ ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి సైబర్ క్రైమ్ విభాగంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తదుపరి దర్యాప్తును కొనసాగిస్తామని పోలీసులుతెలిపారు. ఈ ఘటనపై పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయం పవన్ కు తెలిస్తే వ్యవహారం మరింత సీరియస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కారణం గతంలో జరిగిన వివాదంలోనూ పవన్ తన తల్లిని మాట అన్నందుకే ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోవైపు పార్టీలు, అభిమాన నటులు అనేవి పక్కనపెట్టి ప్రతీ ఒక్కరూ ఇటువంటి ఘటనలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం, వారిని శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
