ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ , కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఓ.సీ.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికల కమిషన్‌పైనా, ఐఏఎస్‌లపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఫలితాల్లో వైసీపీ విజయం తథ్యమని తేలడంతో ఈవీయంలపై ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.ఎన్నికల తరువాత చంద్రబాబును ఏ ఒక్క జాతీయ పార్టీ నాయకుడు కూడా పట్టించుకోరనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందుగానే ఈవీయంల పేరుతో జాతీయస్థాయిలో కుట్రలకు పాల్పడుతూ రాష్ట్ర పరువును బజారుకీడ్చుతున్నాడని విమర్శించారు. డబ్బు, అధికార దుర్వినియోగం, హత్యా రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు దుర్మార్గపు ఆలోచలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని, అయినా అధికారంలోకి వస్తామని చంద్రాబు కోతలు కోస్తూ మభ్యపెడుతున్నాడని తెలిపారు. గత ఐదేళ్ల నుంచి చంద్రబాబు అక్రమంగా అవినీతితో సంపాదించిన సొమ్ముతో పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు మరో ఐదు కట్టవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
