ఈరోజు ఉదయం తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రధేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అధినే వైఎస్ జగన్ కారుకు ఓ మహిళ అడ్డొచ్చారు. దీనితో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. పద్మావతి అతిథి గృహం నుంచి వైఎస్ జగన్ కాన్వాయ్ బయలుదేరిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనితో కలకలం చెలరేగింది.శ్రీవారిని దర్శించుకున్న తరువాత వైఎస్ జగన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. పద్మావతి అతిథిగృహం నుంచి ఆయన కాన్వాయ్ తిరుపతి వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో ఓ మహిళా భక్తురాలు హఠాత్తుగా వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుపడ్డారు. దీనితో డ్రైవర్ కారును సడన్గా ఆపారు. డ్రైవర్ పక్కసీటులో కూర్చున్న వైఎస్ జగన్ కిందికి దిగారు. ఆ మహిళను పలకరించారు. దెబ్బలు తగిలాయా? అంటూ అడిగారు. దీనితో ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు. తన భర్త నిరుద్యోగి అని, ఆయనకు ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీయగా.. తాను అమలాపురం నుంచి వచ్చానని ఆమె తెలిపారు. ఆమె వివరాలను తీసుకోవాలని తన వ్యక్తిగత కార్యదర్శికి సూచించారు. అర్హతలను బట్టి ఉద్యోగం దక్కేలా ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే గెలిచిన తర్వత కూడా జగన్ కు ప్రజలపై ప్రేమ పోలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
