ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు అందించారు. కాంట్రాక్టు అధ్యాపకులు ఏడాది కాలానికి పూర్తి వేతనం అందుకోవడమనే కలను సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆచరణలోకి వచ్చింది. ఫలితంగా 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తూ ఉద్యోగ భద్రత మాట అటుంచితే మిగతా ఉద్యోగుల మాదిరిగా కనీసం ఏడాదిలో 12 నెలల వేతనాన్ని సైతం పొందలేని దుర్భర పరిస్థితులకు ఇక తెరపడింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి కలను సాకారం చేశారు. కాంట్రాక్టుఅధ్యాపకులకు 12 నెలలకు పూర్తి వేతనాన్ని ఇవ్వాలని ఆయన ఇచ్చిన ఆదేశం అప్పటికప్పుడే జీవో రూపం దాల్చింది. దీంతో ఈ ఉత్తర్వులకోసం 19 ఏళ్ల నుంచి ఆందోళనలు, ధర్నాలు, విజ్ఞప్తులు చేస్తూ వచ్చిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తించే విధంగా ఏడాదికి 12 నెలలకు వేతనం చెల్లించే విధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు.
