ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు వరకు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఆడిందే ఆట..పాడిందే పాట. ప్రభుత్వ నిబంధనలు సైతం వారికి అనుకూలంగా మారుతూ వచ్చేవి. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధిలో పారదర్శకత అనేవి అస్సలు ఉండేవి కాదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యం నడిచింది. అంచనాలు అమాంతం పెరిగిపోయేవి. తమ వారికి పనులు దక్కేలా టెండర్ నిబంధనలను ఎలా పడితే అలా మార్చేసే వారు. అధికార అండతో పనులు దక్కించుకుని రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. కర్నూల్ జల్లాలోని తెలుగు గంగ లైనింగ్ పనుల విషయంలోనూ ఇదే తరహా దోపిడీకి ఎత్తుగడ వేశారు. చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ నేత సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా తెలుగుగంగ లైనింగ్ టెండర్ల వ్యవహారం సాగింది. మొదటి సారి టెండర్లు పిలిచినప్పుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టస్ తప్పుడు పత్రాలు దాఖలు చేసింది. ఈ విషయం బహిర్గతం కావడంతో వివాదాస్పదంగా మారింది. ఆ కంపెనీతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అంటే ఈ ఏడాది మార్చి 7వ తేదీన అగ్రిమెంట్ చేసుకున్నారు. మూడు నెలలు గడిచినా ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. దీంతో ఇంజినీర్లు ఇటీవలే నోటీసులు ఇచ్చారు. పనులు మొదలు పెట్టకపోవడంతో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల టెండర్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే సీఎం రమేష్ పనులు మొత్తం ఆగినట్లేనా..!
