చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని విఙ్ఞప్తి చేసిన తమిళనాడు మంత్రుల బృందం అభ్యర్థన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. తాగునీటి కోసం లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల బృందంతో సీఎం జగన్ అన్నారు. ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖా మంత్రి గణేశన్, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖా మంత్రి జయకుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ మనివాసన్ శుక్రవారం సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా తాగునీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని మంత్రులు విఙ్ఞప్తి చేశారు. తాగడానికి నీళ్లులేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆయన సానుకూలంగా స్పందించడంతో తమిళనాడు మంత్రుల బృందం ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపింది. అడగగానే మానవత్వంతో స్పందించారంటూ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
