ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత.. తండ్రి పేర్లు చెప్పుకుని బతికే ఆంధ్రా పప్పు లోకేష్‌కు తన గురించి మాట్లాడే అర్హత లేదని అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సర్పంచ్ గా కూడ గెలవలేని నీవు మమ్మల్నీ విమర్శించడం హాస్యస్పదం అన్నారు. ట్వీట్లు చేస్తూ..ఇంటికే పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. ఆ ట్వీట్లు కూడా వేరెవరో పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు అమెరికాలో చదువుకున్నప్పటికీ.. ఆయనకు ట్వీట్లు కూడా చేయడం రాదని అన్నారు. నెల్లూరులోని ఏడో డివిజన్ సాయిబాబా పాళెం, నాగేంద్ర నగర్, కుమ్మరవీధి, నవాబుపేట ప్రధాన రోడ్డు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నోటి పారుదల శాఖ మంత్రి అని ట్విట్టర్‌లో కామెంట్ చేస్తున్న లోకేష్‌కు ధైర్యముంటే సాగునీటి వ్యవస్థపై మీడియా ముందుకు లెక్కలతో వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో.. వాటి సామర్థ్యం.. నీళ్లు ఎలా వస్తాయో లోకేష్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. వరదనీటిని ప్రభుత్వం వృథా చేస్తోందంటూ అజ్ఞానంతో విమర్శలు చేస్తున్నారన్నారు. లోకేష్ పది మాటలు మాట్లాడితే 20 తప్పులు దొర్లుతాయని, అలాంటి ఆయన ఇతరులను విమర్శించడం సిగ్గు చేటన్నారు మంత్రి అనిల్ కూమార్ యాదవ్.
