Home / ANDHRAPRADESH / కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా బీజేపీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు…!

కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా బీజేపీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు…!

ప్రత్యర్థి పార్టీని బలహీనపర్చేందుకు కోవర్డ్ ఆపరేషన్లు చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు దేశంలో ఎక్కడా ఉండరు. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు తెలివిగా ఆ పార్టీలోకి తన కోవర్టులను పంపాడు. ప్రజా రాజ్యం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న పరకాల ప్రభాకర్ చంద్రబాబు పంపిన కోవర్ట్ అని..గతంలో ఆ పార్టీలో పనిచేసిన వారు చెబుతుంటారు. ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలను, జరుగుతున్న పరిణామాలను చంద్రబాబుకు చేరవేసిన పరకాల చివరకు పార్టీ ఆఫీసులోనే ప్రెస్‌మీట్ పెట్టి మరీ చిరంజీవి పరువు తీశాడు. ప్రజారాజ్యం పార్టీ పరాజయానికి గల కారణాలలో ప్రధానంగా పరకాల ఎపిసోడ్ కీలక పాత్ర పోషించింది. ప్రజారాజ్యం పార్టీని దిగ్విజయవంతంగా కుప్పకూల్చిన పరకాల చివరకు చంద్రబాబు చెంతకు చేరాడు. ఇలా పరకాల లాంటి వారిని ఎందరినో కోవర్ట్‌లుగా దింపి ప్రత్యర్థి పార్టీలను బలహీనపర్చేవాడు చంద్రబాబు.. తాజాగా కేంద్రంలో మోదీ రెండోసారి అధికారంలోకి రావడం, ఏపీలో చంద్రబాబు ఘోర పరాజయం పాలవడం జరిగింది. దీంతో చంద్రబాబు మళ్లీ తన బుర్రకు పదను పెట్టి..బీజేపీలోకి కోవర్ట్‌లుగా తనకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపాడు. ఇందుకు జగన్ ప్రభుత్వం విచారణ జరిపిస్తే ఎదురయ్యే కేసుల నుంచి తప్పించుకోవడం ఒక కారణమైతే , భవిష్యత్తులో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగకూడదు అని మరో కారణం. అందుకే చంద్రబాబు సుజనా, సీఎం రమేష్‌లను బీజేపీలోకి కోవర్ట్‌‌లుగా పంపించినట్లు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాషాయ కండువా కప్పుకున్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, చంద్రబాబును వెనుకేసుకువస్తూ, బీజేపీలో టీడీపీ క్రియాశీలక నేతలు చేరకుండా అడ్డుకుంటూ..అచ్చం పచ్చనేతలుగానే వ్యవహరిస్తున్నారు.

తాజాగా చంద్రబాబు కోవర్ట్ ఆపరేషన్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్లు వేశారు. తనకు సంబంధించిన విషయాలను సెటిల్ చేసుకునేందుకు అవసరానికి తగ్గట్టుగా బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలను లాబీయింగ్ ద్వారా ప్రభావితం చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నాడనేలా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాస్త ఆలస్యమైన కుట్రలు, దోపిడీలు చేసిన వారి పాపం పండుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. దీనికి ఉదాహరణగా చిందబరం అరెస్ట్‌ గురించి ప్రస్తావించారు. కేంద్రమాజీ మంత్రి చిదంబరం 20సార్లు ముందస్తు బెయిల్ తో అరెస్ట్ ను తప్పించుకున్నా.. చివరకు కటకటాల పాటు కాక తప్పలేదని..అలాగే 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే రీతిలో ఉంటుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గతంలోలాగా అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అంత సులువు కాదన్నారు. గతంలో తనకు తీవ్ర వ్యతిరేకి అయిన బీజేపీ నేత సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాకుండా కమలం పార్టీలోని తన సామాజికవర్గానికి చెందిన కంభంపాటి హరిబాబు లాంటి వారి సహకారంతో అడ్డుకున్నాడు. చంద్రబాబు. ఇప్పుడు తనతో అదే స్థాయిలో వైరం ఉన్న బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణను కదిలించి..ఆ పదవిలో తనకు విధేయుడిగా ఉండే వ్యక్తిగా నియమించుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నాడంటూ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కన్నాను తప్పించడం కోసం సుజనా చౌదరీ.. సీఎం రమేశ్‌లతో బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద లాబీయింగ్ చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుజనా, సీఎం రమేష్‌లు ఎప్పటికప్పుడు ఢిల్లీలో జరిగే పరిణామాల్ని తమ బాస్ కు బ్రీఫ్ చేస్తుంటారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మొత్తంగా బీజేపీలోకి కోవర్ట్‌లుగా చేరిన సుజనా, సీఎం రమేష్‌లు..ఆ పార్టీని పూర్తిగా నాశనం చేసి..తిరిగి టీడీపీకి వెళ్లిపోతారని…ఇది పూర్తిగా చంద్రబాబు కోవర్ట్ ఆపరేషన్‌లో భాగమేనని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి గతంలో తనకు బద్ధ శత్రువైన సోమువీర్రాజును లాబీయింగ్ ద్వారా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు తనకు వ్యతిరేకి అయిన కన్నా లక్ష్మీనారాయణను ఏపీబీజేపీ అధ్యక్ష పదవిని తొలగించాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.