చంద్రముఖి సినిమా గుర్తుంది కదా…అందులో చంద్రముఖిలా మారిన హీరోయిన్ జ్యోతికను చూపిస్తూ …చూడు పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అంటూ..ప్రభుతో అంటాడు. సేమ్ టు సేమ్..పూర్తిగా చంద్రబాబులా మారిన పవన్ కల్యాణ్‌ను చూడు అంటూ..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైటైర్ వేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కృష్ణానది వరదల నేపథ్యంలో రాజధానిగా అమరావతి సేఫ్ కాదని, నిర్మాణాలకు రెట్టింపు ఖర్చు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ….గత కొద్ది రోజులుగా వైసీపీ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ మాత్రం రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు సుముఖంగా లేరు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే అభివృద్ది వికేంద్రీకరణ దిశగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలను రాజధాని స్థాయిలో డెవలప్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ మంత్రులు, కీలక నేతలు అమరావతి నుంచి రాజధానిని తరలించడం లేదని చెప్పినా…టీడీపీ నేతలు మాత్రం రాజధానిపై రైతులను రెచ్చగొట్టే పనిలో పడ్డారు. పనిలో పనిగా చంద్రబాబు తన పార్టనర్ పవన్ కల్యాణ్‌ను కూడా రంగంలోకి దింపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు అమరావతిలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ అమరావతి రాజధానిగా ఉండాల్సిందేనని, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోనంటూ రెచ్చిపోతున్నారు. ఇదే పవన్ కల్యాణ్ గత ఎన్నికల సమయంలో అమరావతి ఒక కులానికి చెందిన రాజధానిగా ఉండకూడదు..అసలు రాజధానిగా అమరావతి అనుకూలం కాదని ప్రకటించాడు. అయితే తన పార్టనర్ చంద్రబాబుకు ఇబ్బందుల్లో ఉన్నప్పడల్లా ఎంట్రీ ఇచ్చే పవన్ ఇప్పుడు అమరావతిపై యూటర్న్ తీసుకుని రాజధానిగా అమరావతి ఉండాల్సిందే అంటున్నాడు.
తాజాగా పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. సెప్టెంబర్ 1 న విశాఖపట్నంకు చెందిన టీడీపీ కీలక నేతలు వైసీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై స్పందించారు. అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు తీరు మార్చుకోలేదని, దీంతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారని చెప్పారు. ఇక రాజధాని అమరావతి విషయంలో అస్పష్టత ఏమీ లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజధానిలో ఉన్న కష్టనష్టాలు సరిచేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని చెప్పిన వ్యక్తి, నేడు యూటర్న్ తీసుకుని మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని చురకలంటించారు. చంద్రబాబు యూటర్నులు తీసుకున్నట్టే పవన్ కూడా రాజధాని విషయంలో యూటర్న్ తీసుకున్నారంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. దీంతో నెట్‌జన్లు చంద్రముఖి డైలాగ్ స్టైల్లో పూర్తిగా చంద్రబాబులా మారిన పవన్ కల్యాణ్‌ను చూడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా రాజధాని ఇష్యూలో పార్టనర్లు బాబు, పవన్‌ల మధ్య రహస్య బంధాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి బయటపెట్టారు.