గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 2న సచివాలయాల ప్రారంభానికి సన్నాహాలపై సీఎం సమీక్షించారు. నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకుపైగా నియామకాలు చేయగలిగామన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లకు ఉద్దేశించిన కాల్ సెంటర్‌లలో ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నామన్నారు అధికారులు.. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్ సెంటర్‌ను సిద్ధంచేస్తున్నామన్నారు. ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా ఒక నంబర్ ఉండాలన్నారు సీఎం.. ఉద్యోగాల భర్తీకోసం అతిపెద్ద ప్రక్రియను గ్రామ సచివాలయాల రూపంలో నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ పరీక్షలు నిర్వహించలేదన్నారు అధికారులు.
సెప్టెంబరు చివరివారంలో పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామన్నారు. గ్రామ, సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులను సమకూర్చారా.? లేదా? అని సీఎం అడిగి తెలుసుకున్నారు. 72గంటల్లో సమస్యను తీర్చడానికి అవసరమైన విధంగా సచివాలయాల్లో ఏర్పాట్లు ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్ కూడా ఉండాలన్నారు. గ్రామ సెక్రటేరియట్‌నుంచి సంబంధిత శాఖాధిపతికి అప్రమత్తత చేసేలా వ్యవస్థ ఉండాలని, ఎమ్మార్వో లేదా ఎండీఓ, కలెక్టర్, అలాగే సంబంధిత శాఖ సెక్రటరీ… ఇలా వీరందరితో గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం ఉండాలన్నారు. జాబ్‌చార్టు ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు విధులు కేటాయించిన విధులపై సీఎం సమీక్ష చేసారు. ప్రజలకు పూర్తిగా అండగా ఉండాలన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థలపై మానిటరింగ్ చాలా ముఖ్యమైందని, నాలుగు లక్షలమందిచేత పనిచేయించుకోవడం చాలా ప్రాధాన్యత ఉన్న అంశమని, మానిటరింగ్, సమీక్ష లేకపోతే ఫలితాలు రావన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీలు జరగాలన్నారు. వేలిముద్రలు సరిగ్గా పడకపోతే వీడియో స్క్రీనింగ్ ద్వారా వెంటనే పథకాన్ని అందించాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 237 సర్వీసులు తీసుకురావాలని, 72గంటల్లోగా అందే సర్వీసులు 115 కాగా మిగిలిన సర్వీసులుకూడా ఎప్పటిలోగా చేస్తామన్నదానిపై వర్గీకరణ చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు ప్రణాళికను సమీక్షించారు.