తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాషను సైతం ఉపయోగించారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని, పెన్షన్ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదంటూ విమర్శించారు.
పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని అయ్యన్న మండిపడ్డారు. ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని, పాత కేసులు బయటికి తీస్తున్నారంటూ ఆరోపించారు. అయితేయ కేసులకు ఎవరూ భయపడబోరని, పనికిమాలిన పల్నాడు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కోడెల శివప్రసాదరావుపై అక్రమంగా కేసులు పెట్టి, బెదిరింపులకు దిగి వేధించారని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ వేధింపులకు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటూ అయ్యన్న అన్నారు. మంత్రి బొత్స సత్య నారాయణ తానెంతో నీతిమంతుడు, పతివ్రతలాగా మాట్లాడుతున్నాడని, వోక్స్ వ్యాగన్ కంపెనీ వెళ్లిపోవడానికి బొత్సేకారణమన్నారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.