Home / ANDHRAPRADESH / టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ స్కామ్‌లపై సుప్రీంకోర్ట్‌కు వైసీపీ ఎంపీ సంచలన లేఖ..!

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ స్కామ్‌లపై సుప్రీంకోర్ట్‌కు వైసీపీ ఎంపీ సంచలన లేఖ..!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ .మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడా.. భారీగా అక్రమాస్థులు కూడగట్టాడా..హవాలా సొమ్ముతో విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడా..రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చుబిగుస్తుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిజమే అనిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ స్కామ్‌లపై విచారణ జరిపించాలని ఏకంగా సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యూలేషన్స్, మనీలాండరింగ్ తోపాటు ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గొట్టడం ద్వారా రవిప్రకాష్ భారీగా అక్రమాస్తులు కూడగట్టారంటూ విజయసాయిరెడ్డి తన లేఖలో ఫిర్యాదు చేశారు . అంతే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాంకులను మోసం చేసిన ఘరానా ఆర్థిక నేరస్థుడు మొయిన్ ఖురేషీతోనూ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్‌తోనూ, రవిప్రకాష్ చేతులు కలిపి చాలా మందిని మోసం చేశారని తన లేఖలో పేర్కొన్నారు. సానా సతీష్, మొయిన్ ఖురేషీ, రవిప్రకాష్ ముగ్గురూ కలిసి నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి పెద్ద ఎత్తున హవాలాకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ హవాలా సొమ్మును కెన్యా, ఉగాండాలో, కంపాల సిటీ కేబుల్‌లో పెట్టుబడులు పెట్టారంటూ…రవిప్రకాష్ అవినీతి వ్యాపారాలకు సంబంధించిన జాబితా, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజయసాయి రెడ్డి అందించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3న సీజేకు లేఖ రాయడంతో, ఇప్పటికే ఈడీ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీవీ 9 సీఈవోగా పని చేసే కాలంలో సంస్థ నిధులను తన సొంతానికి దుర్వినియోగం చేశారంటూ ఏబీసీఎల్ సంస్థ ప్రతినిధులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రవిప్రకాశ్‌సు అరెస్ట్‌ చేయగా, కోర్ట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు రవిప్రకాష్‌ను చంచలగూడ కోర్ట్‌కు తరలించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న రవిప్రకాశ్‌పై ఈడీ విచారణ ప్రారంభం కావడంతో ఆయన చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడి, వేల కోట్లు అక్రమాస్థులు కూడగట్టారని, హవాలా డబ్బునంతా విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు రవిప్రకాష్‌పై ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ‌్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధారాలతో సహా సుప్రీంకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో రవి ప్రకాష్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా రవిప్రకాష్ నేర చరిత్రను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీంకోర్ట్ సాక్షిగా బయటపెట్టడం ఏపీ మీడియా, రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.