ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల మధ్య రహస్య పొత్తు ఉందని…అది ఇప్పటికీ కొనసాగుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. 2014 ఎన్నికలకు ముందు బాబుగారి రాజగురువును కలిసిన కొద్ది రోజులకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీ స్థాపించిన తొలి మీటింగ్‌లోనే అటు కాంగ్రెస్ పార్టీపై, ఇటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన పవన్‌కల్యాణ్…చంద్రబాబును మాత్రం పల్లెళ్లు మాట అన్లేదు సరికదా.ఆయన చాలా మంచి వ్యక్తి అని కితాబు ఇచ్చినప్పుడే సందేహాలు వచ్చాయి. ఆ ఎన్నికలలో పోటీ చేయడానికి సమయం లేదని చంద్రబాబును గెలిపించండి అంటూ కాలికి బలపాలు కట్టుకుని ఊరూరా తిరుగుతూ…స్టేజీలపై ఊగిపోతూ ప్రసంగాలు ఇచ్చాడు. పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్ కలిసి వచ్చి చంద్రబాబు ఆ ఎన్నికలలో గట్టెక్కి అధికారంలోకి వచ్చాడు. ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయాడు. అయితే ఒక పక్క ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ప్రజల తరుపున పోరాడుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ మాత్రం పత్తా లేకుండా పోయాడు. పైగా చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడల్లా జగన్ పోరాటాలను డైవర్ట్ చేయడానికి బయటకు వచ్చి ఓ రెండు మూడు రోజులు డ్రామాలు ఆడేవాడు. రాజధాని రైతుల పోరాటం విషయంలోకాని, అగ్రిగోల్డ్ బాధితుల విషయంలోకాని..పవన్ ఎంట్రీ ఇచ్చి సమస్యను పక్కదారిపట్టించి మళ్లీ గెస్ట్‌హౌస్‌కు వెళ్లిపోయేవాడు.
అయితే సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జగన్ పాదయాత్రకు ప్రజల్లో అపూర్వ స్పందన్న వస్తున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సినిమాలకు ప్యాకప్ చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాడు.విజయవాడలో జరిగిన పార్టీ ఆవిర్భావ మీటింగ్‌లో లోకేష్ అవినీతిపరుడు, తాటతీస్తా అంటూ చెలరేగిపోయాడు. తద్వారా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వస్తుందనే భ్రమలు కల్పించాడు. పాపం కమ్యూనిస్ట్‌లు కూడా పవన్‌ను నమ్మి ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో ఎంతసేపూ ప్రతిపక్ష నాయకుడు జగన్ ఎలా సీఎం అవుతాడో చూస్తా..వైసీసీ దొంగలు అధికారంలోకి ఎలా వస్తారో చూస్తా అంటూ విమర్శలు చేయడంతో ఇదంతా చంద్రబాబుతో రహస్య పొత్తులో భాగమని సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. అంతే కాదు చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ మంత్రులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో జనసేన తరపున డమ్మీ అభ్యర్థులను దించాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జగన్‌ను అధికారంలోకి రానివ్వకుండా చూడడం, మళ్లీ చంద్రబాబునే సీఎం చేయాలనే ఎజెండాలో భాగంగానే పవన్ కల్యాణ్ అధికార టీడీపీ బదులు ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేస్తున్నాడని ప్రజలు గ్రహించారు. అందుకే జగన్‌కు ఏకంగా 151 సీట్లు కట్టబెట్టి టీడీపీకి కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. ఇక జనసేనకు కేవలం ఒకే ఒక్క సీటును కట్టబెట్టారు. అదీ రాజోల్‌లో జనసేన తరపున గెలిచిన రాపర్తి వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచాడే తప్ప..పవన్ ఛరిష్మాతో కాదనే చెప్పాలి. స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో చిత్తుగా ఓడిపోయాడు. అక్కడ వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవడం గమనార్హం. దీన్నిబట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల రహస్య పొత్తును ప్రజలు ఛీత్కరించినట్లయింది.
అలాగే గాజువాక, భీమవరంలో టీడీపీ కూడా సరిగా ప్రచారం చేయలేదు. అక్కడ పవన్ కల్యాణ్ గెలవాలనే తపనతో చంద్రబాబు కనీసం ఒక్కసారి కూడా ప్రచారం నిర్వహించలేదు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నాడు. తాజాగా గాజువాక సమీక్ష సందర్భంగా.. గడచిన ఎన్నికల్లో చంద్రబాబు పర్యటించకపోవడం వల్ల టీడీపీ ఓడిపోయిందని..ఎందుకు ప్రచారం చేయలేదని ఒక కార్పొరేటర్ నిలదీశాడు. దీనికి చంద్రబాబు బదులిస్తూ ఒక పార్టీ అధ్యక్షుడు పట్ల హుందాతనం ప్రదర్శించాలనే ఉద్దేశంతోనే తాను పర్యటించలేదని చెప్పుకొచ్చాడు. గాజువాకలో నేను పర్యటించకపోవడం వల్ల టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు కొంత ఇబ్బంది ఎదురైంది. అదే నేను పర్యటించి ఉంటే కొన్ని ఓట్లు పెరిగి ఉండేవి. గాజువాకలో మన అభ్యర్థి శ్రీనివాసరావు బాగా పనిచేశారు కానీ… పవన్ కల్యాణే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది..చంద్రబాబు ఓపెన్‌గా చెప్పేశాడు. దీన్ని బట్టి రహస్య పొత్తులొ భాగంగానే గాజువాక, భీమవరంలో కావాలనే చంద్రబాబు ప్రచారం చేయలేదని, అలాగే చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, నారాలోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయలేదని అర్థమవుతుంది. దీన్ని బట్టి ఎన్నికలకు ముందు వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా ఉండాలనే పవన్ కల్యాణ్ తో విడిగా పోటీ చేయించానని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నట్లు అయింది. మొత్తంగా పార్టనర్ పవన్‌కల్యాణ్‌తో ఉన్న రహస్య పొత్తును చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లయింది. అయితే ఆ రహస్య పొత్తు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగడం గమనార్హం.