టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుండడంతో చంద్రబాబుని జైలుకు పంపించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని జేసీ పేర్కొన్నారు. అయితే ఇందులో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పాత్ర ఉందో లేదో తాను చెప్పలేనని జేసీ అన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ కుటుంబసభ్యులతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్న జేసీ తన బస్సులకు పర్మిట్లు రద్దు చేసినా జగన్ ఎప్పటికీ మావాడే అంటూ చెప్పుకొచ్చారు. జగన్ కష్టపడుతున్నాడు…అందుకే పనితీరుపై 100 కు 150 మార్కులు వేశానని జేసీ చెప్పారు. కాగా జగన్ సర్కార్ గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తుండడంతో చంద్రబాబుతో నేరుగా ఈ విషయాన్ని ప్రస్తావించి, జైలుకు ఎప్పుడూ వెళుతున్నారంటూ అడిగానని జేసీ తమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను బయటపెట్టారు. జేసీ బాబుకు ఫోన్ చేసి..ఏం బాబూ ఎప్పుడూ లోపలికి (జైలుకు) వెళ్లేది అని అడుగగా..దానికి చంద్రబాబు..నేను లోపలికి పోను దివాకర్ రెడ్డి, వీళ్లు నన్నేమి చేయలేరు అని అరుంధతి స్టైల్లో జవాబు ఇచ్చాడంట..ఇలా జేసీ..తనకు, బాబుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను బయటపెట్టారు. దీన్ని బట్టి త్వరలోనే చంద్రబాబు జైలుకు పోవడం ఖాయమని టీడీపీలో చర్చ జరుగుతున్నట్లుంది..అందుకే జేసీ ఏకంగా బాబుకే ఫోన్ చేసి లోపలికి ఎప్పుడు వెళుతున్నారంటూ అడిగారని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగాతమ పెదబాసు..చంద్రబాబు రాజధాని, పోలవరంతో సహా వివిధ శాఖల్లో జరిగిన అవినీతికి బాధ్యుడిగా త్వరలోనే జైలుకు పోవడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
