ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన గ్రామ వలంటీర్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడి కిడ్నాప్‌కు యత్నించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి దగ్గర గుడిమూలలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావొద్దని హెచ్చరించిన కొందరు జనసేన కార్యకర్తలు వలంటీర్లపై దాడికిదిగారు. రాజేశ్ అనే వలంటీరును కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌కు ప్రయత్నించినట్టు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గ్రామ వలంటీర్లు రాజేశ్, సునీల్ లు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైట్ స్విఫ్ట్ కారులో వచ్చిన జనసేన కార్యకర్తలు తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, స్థానికులు వెంబడించడంతో లగొంది అనే గ్రామం వద్ద కారు నుండి తనను కిందికి తోసేసినట్టు రాజేశ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రాజేశ్, సునీల్‌లు గ్రామంలో సర్వే నిర్వహించగా జనసేన కార్యకర్త నాయుడు కృష్ణస్వామి తన అనుచరులతో కలిసి అడ్డుకుని ఇలా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
