ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు స్వాగతిస్తున్నారు. గతంలో తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు సీఎం జగన్ వల్ల న్యాయం జరుగుతుందని కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1953 నుంచి మూడేళ్ల పాటు కర్నూలు రాజధానిగా ఉండేదని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసమే రాజధానిని కర్నూలు ప్రజలు వదులుకున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత కర్నూలుకు న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ సీఎంగా చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు.
వెనుకబడిన రాయలసీమ జిల్లాకు కనీసం జ్యూడీషియల్ కేపిటల్ ఇస్తే ఇప్పటికైనా అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ప్రభుత్వం సముచితంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా కర్నూలు ప్రజలు హైకోర్టు కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఏది కోరుటున్నారో అదే జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని, దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. రాజధానిలో చంద్రబాబు, ఆయన మనుషులు నాలుగు వేల ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని అన్నారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు సీఆర్డీఏ పరిధిని పెంచుకున్నారని, దీనిపై విచారణ జరిపించాలని హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు.