ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన మనిషని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజికవేత్త ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన అతిధిగా పాల్గొన్నారు. స్థానిక దేవతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని, విశేష పూజలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14లక్షలకు పైగా ఉన్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీరు ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఈ సామాజిక వర్గీయులంతా ఏకతాటిపై నిలిచి అన్నిరకాలుగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ సామాజిక వర్గీయుల సమస్యలను త్వరలో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తానని ప్రహ్లాద్ మోడీ చెప్పారు. సాక్షాత్తూ దేశ ప్రధాని సోదరుడే జగన్ ని పొగడటం పట్ల ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
