వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి .జగన్ సర్కార్ వరుస షాక్‌లు ఇస్తోంది. గతంలో నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ ట్రావెల్స్ బస్సులను ఆర్టీయే అధికారులు సీజ్ చేయగా..తాజాగా ‘త్రిశూల్ సిమెంట్’ కంపెనీ లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు… లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి సీఎం జగన్‌ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని…తన ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
సీఎం జగన్‌పై జేసీ వ్యాఖ్యలపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన జేసీ దివాకర్ రెడ్డి.. నీతులు మాట్లాడుతారు కానీ పాటించరని మండిపడ్డారు. తన ఇంట్లో పనిచేసే పని మనుషుల పేర్లతో త్రిశూల్ సిమెంట్స్‌ను అక్రమంగా పొందారంటూ జేసీ బినామీ బాగోతాన్ని కేతిరెడ్డి బయటపెట్టారు. ఆఖరకు పని మనుషుల షేర్లను కూడా జేసీ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. అదే విధంగా రూ. 200 కోట్ల రూపాయల విలువైన సున్నపురాయి గనులను జేసీ అక్రమంగా విక్రయించారని ఆరోపించారు. జేసీకి ఇచ్చిన త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు ప్రభుత్వం రద్ధు చేయటాన్ని స్వాగతిస్తున్నామని అన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కొండలను దోచుకోవడంతో జేసీ దిట్ట అని.. ఆయన అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. దివాకర్ రెడ్డిపై బినామీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని, అలాగే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా త్రిశూల్ సిమెంట్స్ స్కామ్‌లో జేసీ దివాకర్ రెడ్డి బినామీ బాగోతాన్ని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి బయటపెట్టడం..అనంతపురం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.