ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా మారిందని…రైతులు, టీడీపీ కార్యకర్తలతో పాటు ఇప్పుడు అధికారులపట్ల కక్షపూరితంగా కేసులు పెడుతుందని…టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాగా చంద్రబాబ అండతో ఏబీవీ చేసిన అవినీతి అక్రమాలను వైసీపీ నేతలు బయటపెడుతున్నారు. తాజాగా గత టీడీపీ హయాంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించేందుకు దేశ భద్రతను పణంగా పెట్టి ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్ పరికరాలను కొనుగోలు చేయించిన ఏబీవీపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజలను, దేశ భద్రతను కాపాడాల్సిన ఒక ఐపీఎస్ అధికారి దారుణంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం డీజీగా ఉండి ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. త్వరలోనే ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి అక్రమాలు మరికొన్ని బయట పెడతానని చెవిరెడ్డి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాడని.. ఆ సొమ్ముతో తెలంగాణలో విచ్చల విడిగా భూములు కొనుగోలు చేశారని విమర్శలు చేశారు. . ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి తిమింగలం అని.. ఆయన విషయాన్ని వెంటనే కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశభద్రతకు విఘాతం కలిగించేలా విదేశీ కంపెనీలతో సంబంధాలు నెరిపిన ఏబీవీపై సంఘ విద్రోహం కింద కేసు పెట్టాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇక ఏబీవీ బినామీ భూబాగోతంపై చెవిరెడ్డి స్పందిస్తూ…తెలంగాణలో బినామీలతో కొన్న భూములకు రైతుబంధు పథకం ద్వారా రూ. 67 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఘట్టమనేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు బినామీ అని చెప్పారు. ఆయన అవినీతి అక్రమాలు మిగతా ఐపీఎస్ అధికారులకు కూడా తెలుసని అన్నారు. అలాగే విజయవాడ జంట హత్యల కేసులో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేశాడని ఏబీవీపై చెవిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన ఏబీవీ త్వరలోనే దేశం విడిచిపెట్టి పోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే లుకౌట్ నోటీసులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆయనపై తనకు వ్యక్తిగత కక్ష లేదని.. దేశ భద్రత కోసమే మాట్లాడుతున్నానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎవరు మద్దతుగా నిలవకూడదని.. ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు సమర్ధించాలని పిలుపునిచ్చారు. మొత్తంగా ఏబీవీ సస్పెన్షన్ నేపథ‌్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయ, అధికార వర్గాల్లో సంచలనంగా మారాయి.