అమరావతి రైతుల ఆందోళనలు దారి తప్పాయి..టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజికవర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను టార్గెట్ చేస్తూ అమరావతి ఆందోళనకారుల ముసుగులో టీడీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం నందిగామలో ఎంపీపై దాడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు ఈ సారి మహిళలను ముందుపెట్టి కళ్లల్లో కారం కొట్టి పక్కా పథకం ప్రకారం ఎంపీ సురేష్‌ను అంతమొందించేందుకు కుట్ర పన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు మహిళలను ముందుపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై, ఆయన గన్‌మెన్, అనుచరులపై దాడి చేశారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 23 , ఆదివారం సాయంత్రం అమరావతిలో జరిగిన రథోత్సవం కార్యక్రమానికి రాజధాని ప్రాంతం నుంచి ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రథోత్సవం కార్యక్రమం జరుగుతున్నంతసేపు వారు ఎంపీ సురేష్‌ను కించపరిచేలా దుర్భాషలాడారు. వారి తీరును గుర్తించిన ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అక్కడి నుంచి ఒకే కారులో గుంటూరు బయల్దేరారు. సురేష్ గుంటూరు వైపు బయల్దేరిన విషయాన్ని రాజధాని ప్రాంతం నుంచి అమరావతికి బస్సులో వస్తున్న టీడీపీ మహిళలు, నాయకులకు చెప్పారు. లేమల్లె గ్రామంలో తన కారులోకి మారడానికి సురేష్ కారు దిగారు.
కాగా అదే సమయంలో రాజధాని ప్రాంతం నుంచి అమరావతికి వస్తున్న టీడీపీ నాయకులు వారి బస్సును సురేష్ కారుకు అడ్డుపెట్టి మహిళలను కిందకు దించారు. బస్సు దిగిన మహిళలు జై అమరావతి అంటూ ఎంపీ సురేష్‌ను రాయలేని పదజాలంతో దుర్భాషలాడుతూ ఆయనపై దాడికి దిగారు. ఎంపీ డ్రైవర్, పీఏ లక్ష్మణ్‌పై దాడిచేసి కొట్టారు. పీఏ లక్ష్మణ్ సోదరుడిని కొందరు మహిళలు చెప్పుతో కొట్టారు. మరికొందరు మహిళలు గన్‌మెన్, ఎంపీ అనుచరులపై కారం చల్లడం మొదలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన గన్‌మెన్, అనుచరులు ఎంపీ సురేష్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. మహిళలను ముందుపెట్టి ఎంపీ సురేష్‌పై దాడి చేసి గన్‌మెన్, ఆయన అనుచరుల కళ్లలో కారం కొట్టిన అనంతరం బస్సులో ఉన్న టీడీపీ నాయకులు దిగి ఎంపీ సురేష్‌ను అంతమొందించాలని కుట్ర పన్నారని ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎంపీపై టీడీపీ నాయకులు పథకం ప్రకారం వరుసగా దాడులు చేయడంపై పెద్ద కుట్ర దాగి ఉందని తెలుస్తోంది. గత రెండు నెలలుగా అమరావతి ఉద్యమం చేయిస్తున్నా ఐదారు గ్రామాల్లో తప్పా..రాష్ట్రంలో పెద్దగా స్పందనలేదు. దీంతో క్రమంగా హత్యారాజకీయాలకు స్కెచ్‌లు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. . ఒక పేరెన్నికన్న ప్రజా ప్రతినిధిని అంతం చేయడం ద్వారా అమరావతి రాజధాని తరలింపును ఆపేందుకు టీడీపీ కుట్ర చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దళిత వర్గానికి చెందిన ఎంపీ సురేష్‌ను టార్గెట్ చేస్తూ దాడులు చేయడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. మరి పోలీసులు ఈ ఘటనపై ఎలా చర్యలు తీసుకుంటారో చూడాలి.