దాదాపు పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లోనే ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మినహా దేశంలోనే మరొకరు లేరన్నది నిస్సందేహం. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించాలన్న నిర్ణయం జగన్ గమ్యాన్ని, గమనాన్ని మార్చేసింది. ఓదార్పు యాత్రలో భాగంగా 800 మందికి పైగా కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వైసీపీని స్థాపించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ప్రమాదాలు జరిగినా బాధితులకు అండగా నిలిచారు. థర్మల్ ప్లాంట్ల వ్యతిరేక పోరాటాలతోపాటు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ఎలుగెత్తారు. జలదీక్ష, రైతు దీక్ష, విద్యార్థి దీక్ష, బందరు పోర్టు సాధన పోరాటంతోపాటు పలు ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. నాడు చంద్రబాబుతో సహా అన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు సమ్మతించినా వైఎస్ జగన్ ఒక్కడే సమైక్యాంధ్ర కోసం గళమెత్తారు. ప్రతిపక్ష నేతగా ఐదేళ్లపాటు ప్రజల్లోనే ఉంటూ రాజ ధాని భూ కుంభకోణాలు, బాక్సైట్ తవ్వకాలు, ఇసుక దోపిడీ, టీడీపీ సర్కారు అవినీతిపై ఉద్యమాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్య మించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో యువభేరి సదస్సులు నిర్వహించారు. అయితే నేడు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల తనయుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తున్న తొలి వారసుడు వైఎస్ జగన్. అంతే కాదు దేశవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రుల తనయుల్లో వైఎస్ జగన్ మాదిరిగా విజయవంతమైన నేత మరొకరు లేరు. సొంతంగా పార్టీ స్థాపించి కుట్రలను చేధించి అపూర్వ ప్రజాదరణతో అధికారం దక్కించుకున్న ఏకైక నేత జగన్ ఒక్కరే. ఈ ఎన్నికల్లో ఒంటిచేత్తో వైసీపీకి అఖండ విజయాన్ని సాధించిపెట్టిన వైఎస్ జగన్ దాదాపు 50 శాతం ఓట్లతో దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించారు. ఏకంగా 86 శాతం సీట్లను వైసీపీ దక్కించుకోవడం విశేషం. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 151 సీట్లను వైసీపీ గెలుచుకుంది. 25 ఎంపీ స్థానాల్లో 22 చోట్ల ఘన విజయం సాధించింది. దీని ఫలితంగా నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12.23 నిమషాలకు వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.