Home / ANDHRAPRADESH / ఇంగ్లీష్ మీడియం నిర్ణయం చారిత్రాత్మకం.. సీఎం జగన్‌కు ఎన్‌. రామ్ అభినందనలు..!

ఇంగ్లీష్ మీడియం నిర్ణయం చారిత్రాత్మకం.. సీఎం జగన్‌కు ఎన్‌. రామ్ అభినందనలు..!

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని…సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు భాషను ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్ష టీడీపీతో సహా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు హైకోర్టు కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పింది. అయితే ది హిందూ గ్రూపు ఛైర్మన్ ఎన్‌రామ్ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు.

 

తాజాగా విజయవాడలోని గేట్‌ వే హోటల్‌ల్లో ‘ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌ రామ్‌ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రత్మకమైనదని ఈ నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. నాణ్యమైన విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఇంగ్లిష్‌ మీడియంలో చదువు చెప్పడమే కాదు.. మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల బాధలను తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. సీఎం అయ్యాక వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. మొత్తంగా ఇంగ్లీష్ మీడియంపై రాద్ధాంతం చేస్తున్న వారికి ది హిందూ గ్రూపు ఛైర్మన్ ఎన్‌.రామ్ చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టు అనే చెప్పాలి.