Home / ANDHRAPRADESH / ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనాథ్‌కు కేబినెట్‌ హోదా.. వైఎస్ సన్నిహితుడు కూడా !

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనాథ్‌కు కేబినెట్‌ హోదా.. వైఎస్ సన్నిహితుడు కూడా !

ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైన దేవిరెడ్డి శ్రీనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. సీనియర్‌ పాత్రికేయుడైన దేవిరెడ్డి ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గతoడాది ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదివారం జీఓ జారీచేశారు. నవంబర్‌ 21న ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జర్నలిజంలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రీనాధ్ సన్నిహిత జర్నలిస్టు కూడా.