విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ కోసమే దుర్గగుడిలో బుద్ధా వెంకన్న తాంత్రిక పూజలు చేయించారని అన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే అమ్మవారి అభరణాలు చోరీకి గురయ్యాయని అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడారు.
గుడి పవిత్రతను టీడీపీ నేతలే దెబ్బతీస్తున్నారని, హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడ్డారు. దుర్గగుడే కాదు.. అన్ని ప్రధాన ఆలయాల సీసీటీవీ దృశ్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాంత్రిక పూజలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అమ్మవారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా దుర్గగుడిలో శాంతిపూజలు జరిపించాలని ప్రభుత్వానికి సూచించారు.అని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు అన్నారు.