వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 175 రోజులు 2200 కిలోమీటర్ల పై చిలుకు పాదయాత్ర చేసిన జగన్ ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రజా సంకల్ప యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. అయితే, జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం వివేషం.
ఇదిలా ఉండగా, బుధవారం నరసాపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రను కొనసాగించిన జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ మహానాడుపై నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జన్మదినాన జరిపే మహానాడులో ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాల్సింది పోయి.. ప్రతిపక్షంపై విమర్శంలు చేయడం ఏమిటని జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంలోనే మహానాడుపై వైఎస్ జగన్ పంచ్‌ల వర్షం కురిపించారు. విజయవాడలో జరిగిన సభలు మహానాడు సభలు కాదని, అబద్ధాలు, మోసాలు, దగా, కుట్రలు, కుతంత్రాలు, వంచన, వెన్నుపోటు ఇలా అనేక విద్యల్లో ఆరి తేరిన వారికి అంతర్జాతీయ పోటీలు జరిగాయన్నారు. ఆ పోటీలు వరుసగా 1955 నుంచి 2018 వరకు 24 సార్లు జరిగాయన్నారు.
విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడు పోటీల్లో చంద్రబాబు నాయుడు తన మొదటి స్థానాన్ని నిలుపుకున్నారన్నారు. అలా మొదటి స్థానంలో నిలిచిన చంద్రబాబు నాయుడు తనకున్న బిరుదును నిలుపుకున్నారన్నారు. ఇంతకీ చంద్రబాబు నాయుడుకు ఉన్న బిరుదు ఏమిటబ్బా అంటూ సభలో పాల్గొన్న నరసాపురం ప్రజలను అడగ్గా.. తుప్పు.. తుప్పు అంటూ సమాధానం వచ్చింది. అలాగే, నెం.2 స్థానాన్ని నారా లోకేష్ కైవసం చేసుకున్నారన్నారు. అతనికి ఉన్న బిరుదు ఏమిటబ్బా అంటూ జగన్ అడిగిన ప్రశ్నకు పప్పు.. పప్పు అంటూ నరసాపురం ప్రజల నుంచి సమాధానం వచ్చింది. ఇలా సభ ఆద్యాంతం జగన్ తనదైన పంచ్‌లతో టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు.