తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదని మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, ఆయన కుటుంబం ఎప్పట్నుంచో చెబుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నేతల నుంచి, కార్యకర్తల వరకు రాజకీయంగా ఆనం కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ ఆవేదన తట్టుకోలేకనే ఇటీవల ఆనం వివేకానందరెడ్డి మృతి చెందాడంటూ పలు సోషల్ మీడియా కథనాలు వెల్లడించాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి టీడీపీ ఎంట్రీని పరిశీలిస్తే.. సోషల్ మీడియా కథనాలను కూడా అంగీకరించాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు, భరోసాతో ఆనం బ్రదర్స్ టీడీపీ కండువాకప్పుకున్నవిషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు నెలల వ్యవధిలోనే గడువు ఉండటం, టీడీపీ ప్రభుత్వ గడువు కూడా ముగుస్తుండటంతో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడం గగనమే అని గ్రహించిన రామ నారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమైపోయారని, ఈ నేపథ్యంలో వైసీపీ నేతలతో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనూ పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌తో ఆనం రామనారాయణరెడ్డి సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనం రామనారాయణరెడ్డిని బుజ్జగించేందుకు తన దూతలను పంపించారని, అయితే ఆనం రామనారాయణరెడ్డి మాత్రం, తాను, ఆనం రంగమూయర్ రెడ్డి వైసీపీలో చేరేందుకు నిశ్చయించుకున్నట్టు చంద్రబాబు దూతలతో చెప్పారని, వైఎస్ జగన్ పాదయాత్ర విశాఖకు చేరుకోగానే.. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు ఆనం రామనారాయణరెడ్డి తేల్చి చెప్పేశారట.