ఒకవేళ మీరు ఉండకపోతే.. నెక్స్ట్ పది సంవత్సరాలు బతికి ఉంటారా..? నెక్స్ట్ పాతిక సంవత్సరాలు మీరు బతికి ఉంటారా..? మనుషులు కలకాలం బతికి ఉంటారా..? అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, సాలూరులో ఏర్పాటు చేసిన జనసేన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం పేరుతో పచ్చని పంటలు, నాలుగైదు పంటలు పండే భూములు 54 వేల ఎకరాలు తీసుకున్నారు.. సంతోషం.. అవి చాలక ఇంకా భూములు కావాలంటూ రైతుల వెంట పడతారెందుకు..? ఇన్ని వేల ఎకరాల భూములు తీసుకుని ఎప్పటికి అభివృద్ధి చేస్తారు..? అంటూ చంద్రబాబు సర్కార్‌ను పవన్ కళ్యాన్ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఓ కథ చెప్పుకొచ్చారు. ఒక రాజు వద్దకు.. దురహంకార వ్యక్తి వెళ్తాడు.. నాకు భూమి కావాలంటాడు.. ఎంత భూమి కావాలని ఆ రాజు ఆ వ్యక్తిని అడుగుతాడు. చాలా అంటాడు. రేపు పొద్దున నుంచి నీవెంత దూరం పరుగెత్తగలవో.. అంత భూమిని నీకు ఇచ్చేస్తాని రాజు చెప్పడంతో ఆ వ్యక్తి పరుగెత్తడం మొదలు పెడతాడు. అలా భూమిపై ఆశ చావక చీకటి పడినా పరుగెత్తుతూనే ఉంటాడు.. ఇంకో ఆరడుగులు పరుగెత్తితే ఆ భూమి కూడా తన వశం అవుతుందని భావించి.. చివరగా ఆరుడుగులు పూర్తి చేసి మరణిస్తాడు. ఇలా ఆ వ్యక్తికి చివరకు మిగిలింది ఆరుడుగులు మాత్రమేనంటూ పవన్ కళ్యాన్ చంద్రబాబు గురించి ఓ కథ చెప్పుకు రావడం గమనార్హం.