ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి మరో షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద నిర్మించతలపెట్టిన పక్కా గృహాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం చాలా నియోజకవర్గాల్లో నిరుపేదలకు గృహ నిర్మాణాలు చేపట్టింది. ఇక వాటి నిర్మాణానికి సరిపడా స్థలం లభించకపోవడంతో జగన్ సర్కార్ వాటిని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది.జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అటు టీడీపీ నేతలను షాక్ కి గురి చేస్తుంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6032 ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు సైతం షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రూ.100 కోట్లతో నియోజకవర్గంలో మంజూరైన 2 వేల ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్దినెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం సామూహిక గృహ ప్రవేశాలను సైతం నిర్వహించింది. అలాగే కుప్పం మండలంలోనే 2 వేల ఇళ్లకు అనుమతులు కూడా ఇచ్చింది. కాని వాటన్నంటిని రద్దు చేస్తూ ఇళ్లు లేని పేదవారందరికీ ఇళ్లను మంజూరు చేసి, ఉగాది నాటికి ఇంటి పత్రాలు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
