తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి పరిధిలోని శేషాచల కొండల్లో అటవీ శాఖ అధికారులు నిర్మించిన వాచ్‌టవర్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, ఏడుకొండలపై ఏసు మందిరాలు అంటూ..వాట్సాప్ ద్వారా ప్రచారం చేసిన వ్యక్తిపై టీటీడీ కేసు నమోదు చేసింది. అరుణ్ కాటేపల్లి అనే వ్యక్తి “అణువణువునా హిందూత్వం” అనే గ్రూపు నుంచి పంపిన వాట్సాప్ మెసేజ్ ఆధారంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. తిరుపతి కరకంబాడి ప్రాంతంలో కొండల్లో నిర్మించిన ఈ వాచ్ టవర్‌పై అటవీ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా ఫోటో తీసి ” ఏడు కొండలపై వెలసిన ఏసు మందిరాలు ” అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరిగినట్లు తేల్చారు. సదరు అరుణ్ అనే ఈ వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడిగా తెలుస్తోంది.ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు శనివారం నాడు తిరుమల టూటౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు అరుణ్ కాటేపల్లిని అరెస్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. కాగా సోషల్ మీడియాలో తిరుమల తిరుపతిపై ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తిరుమల తిరుపతి ప్రతిష్ట మంటగలిపేలా దుష్ప్రచారం చేసిన అరుణ్ కూడా జైలుకు పోవడం ఖాయంగా కనిపిస్తోంది.
